Monday, September 24, 2012

కథే లేని సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్"
* In the country of the blind, the one-eyed man is king *
 

ఏమీ తోచక, శుక్రవారపు అందమైన  సాయంత్రాన్ని వృధా  చేయటం ఇష్టం లేక ఏం  చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా గుర్తొచ్చింది "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ " రిలీజయి మాఇంటికి ఒక అరమైలు దూరంలో ఉన్న థియేటర్లో ఆడుతున్నట్టు. ఒక గంటలో థియేటర్లో ఉన్నా.

పరమభీభత్సమైన,నికార్సయిన పదారణాల తెలుగు  మాస్ మసాలా చిత్రాన్ని సైతం వాతాపి జీర్ణం అనగల నేను,  ఒక అరగంట కాగానే,మొట్టమొదటి సారి వాచీ చూసుకున్నా. ఏ రివ్యూలోనో చదివింది గుర్తొచ్చింది, ఈ సినిమా నిడివి  దాదాపు మూడుగంటలని. గుండె గుభేలు మంది.మిగిలిన రెండున్నర గంటల్ని ఇంకేవిధంగానైనా  నిర్మాణాత్మకంగా  గడపొచ్చా అని ఆలోచిస్తే ఆ షాక్ లో నాకేమీ తట్టలేదు. 

డబ్బున్నవాళ్ళూ  లేని వాళ్ళ మధ్య గొడవలూ, వీటి మధ్య ఏమాత్రం ఆకట్టుకొని విధంగా చిత్రీకరించిన ప్రేమ కథలు.ఇదీ ఈ సినిమా నేపధ్యం. "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్"  టైటిల్ పక్కన శేఖర్ కమ్ముల పేరు చూసి నేను మాత్రం చాలా ఊహించుకున్నా  ఒక చక్కని సందేశాన్ని మంచి కథతో అల్లుకొని మనకందిస్తాడేమో అని.బహుశా  తనే నిర్మాత అవటంవల్ల కావచ్చు పొట్టి స్కర్టు లో  శ్రియానీ,స్లో మోషన్లో అంజలా జావేరీ బొడ్డునీ ని చూపించి చివరికి " నువ్వు కూడానా" అనిపించేలా చేసాడు.

టూకీగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, వర్షం,ఆ వర్షంతో తడిసిన సాయంకాలపు రోడ్లూ, వర్షంలో వేడి వేడి బజ్జీలూ , వెన్నెలా, నైటీల్లో అమ్మాయిలూ, సహజ మైన సంభాషణలూ,మధ్య తరగతి బెడ్రూములూ, వీటి మధ్య ఖాళీల్లో  తన సినిమా తనే కాపీకొట్టి ఇరికించిన కథ ఈ సినిమా.  దారీ తెన్నూ లేకుండా నడిచే ఈ సినిమా చివర్లో అకస్మాత్తుగా ఒక పాత్ర చేత జీవితంలో డబ్బు కాదు, సంతోషం ముఖ్యం అని చెప్పించటం మాత్రం మంచి కామెడీ.

 సినిమా మొదటినుంచీ చివరివరకూ గోల్డ్ ఫేజ్ వాళ్ళు, డబ్బులేని  బి ఫేజ్ వాళ్ళని  "బి ఫేజ్  బగ్గర్స్ " అంటూ  ఛీత్కరించుకోవటమే.నాకు తెలీని ప్రపంచం ఇంకేదో ఉందేమో అనే సందేహాన్ని విజయవంతంగా నాలో కలగజేసాడు దర్శకుడు.
 
 హ్యాపీ డేస్ తో నిరాశపరచిన ఈయన "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" తో తన సినిమా తనే కాపీ చేసుకొని ఏకంగా భయపెట్టేసాడు.

Because of  the mediocrity that is prevailing in the industry, he got elevated  to be a so called "sensible" director by the masses desperately looking for a change . He seriously lacks depth in the story line and minimum quality in  shot making two vital things that an average cinegoer like me expect. Everything he creates just hovers on the surface. Even "Leader" is no exception which he proudly declares as one of his best.

 I may again cry over it  but I still look forward for his next movie.I am one among you, and like many of you, i believe mediocrity is better than nonsense.Friday, September 21, 2012

అసలు సచినెందుకు రిటైర్ అవ్వాలి?శ్రీకాంత్,అబ్దుల్ ఖాదిర్, మంజ్రేకర్ ఇంకా చాలామంది  పాపం చాలా బెంగపెట్టుకున్నారు ఆయన ఎక్కడ రిటైర్ అయిపోతాడేమో అని. ఇంకొంతమంది ఏమంటారంటే ఆయన దేవుడట. మినహాయింపు ఇవ్వాలట. ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేది ఆయనే నిర్ణయించుకోవాలట.


అసలెందుకు రిటైర్ అవ్వాలండీ? ఆయన్ని ఆడుకోనివ్వండి.నలభై కాదు యాభై ఏళ్ళు వచ్చే వరకూ ఆడుకోవివ్వండి.మరీ అంత వయసుమీదపడి ఫీల్డింగ్ చెయ్యలేకపోతే  అంపైర్ పక్కన ఓ కుర్చీ వేసి కూర్చో పెట్టండి. బాటింగ్ కి బై రన్నర్ ని పెట్టండి. పాపం పాతికేళ్ళ నుంచి ఆయనకి బ్యాటూ , బాలూ, తన రికార్డులూ  తప్పితే ఇంకోటి తెలీదు. బయటి ప్రపంచంలో ఎలా బతుకుతాడు చెప్పండి?ఇన్నాళ్ళు సెలక్టర్లూ , కెప్టన్లూ  పదిమంది మీదే దృష్టి పెట్టి, పదకొండో ఆటగాడి గురించి మర్చిపోయారు. ఉన్న వంద కోట్ల మంది నుంచి సచిన్ స్థానం లో  ఇంకో ఆటగాణ్ణి ఎంపిక చేయాలంటే ఎంత కష్టం వాళ్లకి?

 ఒక ఆటగాడి సమర్ధతకి ఆయన నెలకొల్పిన రికార్డులే కొలమానం. అలానే అవి నెలకొల్పడానికి వ్యక్తిగతంగా  ఆటగాడికి ఉండాల్సింది ఆట మీద ప్రేమ,ఏకాగ్రత. వీటి విషయంలో సచిన్ని ఏరకంగానూ తప్పు పట్టడానికి లేదు.అయితే ఏ ఆట ద్వారా ఇంత సాధించాడో, ఆ ఆటనే మించి పోవడంతోనే వస్తుంది చిక్కంతా.

 సచిన్ రిటైర్ అవటం ఆయనిష్టం అని తీర్మానించే వాళ్ళతో పోలిస్తే ఆయన రిటైర్ అవ్వగానే అమ్మయ్య అని నిట్టూర్చే వాళ్ళ శాతం తక్కువే ఉండొచ్చు. కానీ మరీ కొట్టివేసేంత తక్కువేమీ ఉండదు. అలానే ఆయన నీడలో అనామకంగానో, ప్రతిభకి సరైన గుర్తింపు రాక సామాన్య ఆటగాళ్లగానో,అసలు ఆడే అవకాశమే కోల్పోయినవాళ్ళ గురించి  చెప్పాలంటే చాలా ఉంటుంది.

ఆయనకి నిజంగా ఇండియన్ క్రికెట్ కి సేవ చేయాలి అనుకుంటే ఇదే సరైన సమయం. ఆయన మీద అభిమానం ఇలా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే రిటైరై, కోచ్ గానో, గౌరవ సలహాదారుగానో ( ఇలాంటి పోస్టులకు మన దేశంలో కొదవలేదు లెండి ) భావితరాలకి మంచి క్రికెటర్లను అందిస్తే అంతకంటే ఇంకేం కావాలి?
Friday, September 14, 2012

ఆసక్తికరమైన చిత్రం EXAM


ఒక పేద్ద కంపెనీలో పేద్ద ఉద్యోగం. వడపోత తరువాత ఆ పోస్టుకి ఎనిమిదిమంది అభ్యర్ధులు మిగిలారు. అభ్యర్ధులందరూ పరీక్ష గదిలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో టేబిలూ,ఒక కుర్చీ, ఆ టేబిలు మీదొక పేపరు.

ఇన్విజిలేటరు గదిలోకొచ్చాడు. గది లోపల డోరు పక్కన ఒక సెక్యూరిటీ  గార్డు.

ఇన్విజిలేటరు పరిక్ష తాలూకు నియమాలు చెప్పాడు.

ఒకే  ఒక ప్రశ్న , దానికి సరైన సమాధానం రాయాలి అంతే.

ఇకపోతే ఈ పరీక్షలో మిగతా నియమాలు..

ఎవరూ కూడా ఇన్విజిలేటరుతో గానీ, గార్డుతో కానీ మాట్లాడకూడదు.

వాళ్లకిచ్చిన పేపరుని ఉద్దేశపూర్వకంగా గానీ, అనుకో కుండా గానీ పాడు చెయ్యకూడదు.

ఎలాగైనా గెలవాలి అనుకున్నవాళ్ళు బయట ప్రపంచంలో వర్తించే రూల్సుని పట్టించుకోనవసరంలేదు. ఆ గదిలో తను చెప్పిన రూల్సు పాటిస్తూ ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు.

సరైన  సమాధానం చెప్పిన ఒక్కరికే ఈ ఉద్యోగం.

ఆ సమాధానం  చెప్పటానికి వారికున్న సమయం ఎనభై నిమిషాలు.

ఎనీ   క్వచ్చెన్స్? అని , సమాధానం కోసం ఆగి , ఎవ్వరూ ఏమీ మాట్లాడక పోవడంతో , అక్కడున్న స్టాప్ క్లాక్ మీట నొక్కి. "యువర్ టైం స్టార్ట్స్ నౌ " అని చెప్పి బయటికెళ్ళాడు .

గదిలో ఈ ఎనిమిది మందీ, డోరు దగ్గర ఆ గార్డూ.

వీళ్ళు ముందున్న కాగితాన్ని వెనక్కి తిప్పారు.మళ్ళా ముందుకి తిప్పారు. కళ్ళకి దగ్గరగా పెట్టుకొని చూసారు. ఊహూ..అదొట్టి తెల్ల కాగితమే. ఎక్కడా ఆ ప్రశ్న తాలూకు ఆనవాలు కూడాలేదు. ఆ పేపరులాగే అందరూ తెల్లమొహం వేసారు.

ఇక మొదలవుతుంది కథ.

ముందు ప్రశ్న కనుక్కోవాలి. ఆ తరువాత దానికి సమాధానం.

అసలు అది నిజమైన పరీక్షేనా? చివరికెవరు గెలిచారు? అసలెవరైనా గెలిచారా? 

దాదాపు గంటా నలభై నిమిషాల నిడివుండే ఈ హాలివుడ్ చిత్రం ( EXAM) , ఆ ఒకే ఒక గదిలో,ఎక్కడా బోరుకొట్టకుండా ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగుతుంది. వీలయితే చూడండి.

మన తెలుగులో ఇలాంటి చిత్రాలెందుకు రావు? ఆ "బాబుల" డేట్లూ, కోట్ల రూపాయల పారితోషకాలూ, పైగా ఆళ్ళకి సినిమా ఏరియాలవారీ హక్కులు సమర్పించుకోవటాలూ  లాంటివి లేకుండా అతి తక్కువ బడ్జెట్లో తీసేయొచ్చు కదా?

ఆ.. ఏమన్నారూ, ఏమిటీ పగటి కలలు అంటారా? సరే లెండి.

తా.క.:
మన రాం గో వర్మ గారు , తన బుర్ర ఇనప్పెట్లో భద్రంగా దాపెట్టి సినిమాలు తీస్తుండడంతో నాకాయన మీద నమ్మకం ఎప్పుడో పోయింది. మన తెలుగులో ఇలాంటివి తీయగలిగేది ప్రస్తుతానికైతే ఏలేటి మాత్రమే. సినీ వార్తల్లో ఆయన పేరు విని చాలా రోజులయింది. మీకేమైనా తెలుసా ఆయన ఎక్కడున్నాడో, ఏం తీస్తున్నాడో ? తెలిస్తే దయచేసి చెప్పండి.

Thursday, August 16, 2012

చూడదగ్గ మరో సినిమా "The Devil's Double"

కొన్ని సినిమాలు చూద్దామనుకొని అలా అలా వాయిదావేస్తూ ఉంటాము కారణం లేకుండానే.నెలల తరబడి అవి అలా మన లిస్టులో నానుతూ ఉంటాయి.చివరికి ఏదో ఒకరోజు వాటికి మోక్షం ప్రసాదిస్తాం.అయ్యో ఇంతమంచి సినిమా ఇన్నాళ్ళు చూడకుండా ఇలా ఎలా వదిలేసాం?  అని కొంచెం ఆశ్చర్యపోతాం.

ఇదొక పోలిటికల్ థ్రిల్లర్ అనొచ్చేమో. సద్దాం హుస్సేన్ పెద్దకొడుకు ఉదయ్ హుస్సేన్ చుట్టూ తిరుగుతుంది కథ. ప్రాణహాని ఉన్నకారణంగా సద్దాం తనని పోలిన వ్యక్తులతో డూప్ లని తయారు చేసుకున్నట్టే , ఎప్ప్పుడూ విందులూ వినోదాలలో మునిగితేలే ఉదయ్ వాటికి తగిన సమయం దొరకాలంటే ( ప్రాణహాని కూడా మరొక కారణం) తను కూడా తండ్రి లాగే డూప్  ని పెట్టుకోవాలనుకుంటాడు. లతీఫ్ అనే తనని పోలిన వ్యక్తిని బెదిరించి,క్రూరంగా హింసించి ఒప్పిస్తాడు. ఉదయ్ కి డూప్ గా, అతని ఆకృత్యాలను భరిస్తూ,మనస్సాక్షిని చంపుకొని , దాదాపు ఐదేళ్లపాటు  లతీఫ్ పడ్డ కష్టాలూ,అనుభవించిన వ్యధా ఈ సినిమా కథాంశం.

బహుశా ఇదొక నవల ఆధారంగా తీసిన సినిమా అనుకుంటాను.ఉదయ్/లతీఫ్ లుగా డొమినిక్ కూపర్ నటన సింప్లీ సుపర్బ్. ఆ పాత్రలు   తనుతప్ప ఎవరేసినా నప్పదన్నట్టు నటించాడు. సినిమా పూర్తయ్యాక కూడా కొన్నాళ్ళు వెంటాడుతుందితనినటన. హింస,కొద్దిపాటి అడల్ట్ కంటెంట్ కి సిద్దంగా ఉండాలి ఈసినిమా చూడాలంటే.

  ఈసినిమాకి మొదట స్లండాగ్ మిలియనీర్ దర్శకుడు డేనీ బోయల్  ని అనుకున్నారట ఏమైందోగాని  మొతానికి లీ దర్శకత్వం వహించాడీ  సినిమాకి. స్క్రిప్ట్ కి పూర్తి  న్యాయం   చేశాడు కూడానూ.

సీరియస్,ఇంటెన్స్  సినిమాలు ఇష్టపడేవారిని నిరాశపరచదీ  సినిమా.
Tuesday, July 17, 2012

ఇంకో మంచి పుస్తకం It worked for me by Colin Powell

పుస్తకాల దుకాణానికెళ్ళి నప్పుడల్లా ఓ పట్టాన బయటికి రాబుద్ది కాదు. ఎన్ని గంటలైనా అలా తెలియకుండా గడిచిపోతాయి.వివిధ వెబ్ సైట్లలో అప్పటికే సమీక్షల పరంగా మంచి మార్కులు కొట్టేసిన పుస్తకాల్ని వెతికి రాసిపెట్టుకొనే అలవాటు ఉండడం మూలాన, అలాంటి  ఓ రెండు పుస్తకాలు  తీసుకొని, ఓ కుర్చీ లాక్కొని,    అలా కొన్ని పేజీలు  చదివేయటం  అలవాటు బ్రహ్మచారి గా ఉన్నప్పుడు. ఇప్పుడంత లక్జరీ లేదనుకోండి. :(

మొన్నీ మధ్యనే చదివా ఈ పుస్తకం గురించి, It worked for me By Colin Powell. పుస్తకాల దుకాణంలో కనబడగానే ఆసక్తిగా ఓ ఇరవై పేజీలు  తిరగేసా. నాకైతే బాగా నచ్చిందీ పుస్తకం. అయితే,అందరికీ తెలిసిన విషయమే , ఈ నాన్-ఫిక్షన్ పుస్తకాలు చదవడంలో ఓ చిక్కుంది. ఆ రాసినాయన/ఆమె  మీద మనకు అప్పటికే ఒక అభిప్రాయముంటే , అది మనకి సరిపడనిదైతే , చదవటం చాలా కష్టం. అలానే మొదలెట్టానీ పుస్తకాన్ని. కొన్ని పేజీలు  చదవగానే, అర్జెంటుగా నా అభిప్రాయాన్ని గట్టు మీద పెట్టి పుస్తకాన్ని పూర్తి చేయాలనిపించింది. అమెజాన్ లో ఆర్డర్ చేసేసా మొబైల్ లోంచే అప్పటికప్పుడు. Can't wait to have it in my hands. It's repetition of what exactly happened to me with "Decision points".


Wednesday, July 27, 2011

కల్మాడీ-మతిమరపు

శ్రీకృష్ణ జన్మస్థానం అలా అల్లంత దూరంలో కనపడగానే మన నాయకులకి ఏ గుండెనోప్పో , బీపీ లాంటివో, ఇంకేవేవో వచ్చేసి అమాంతం స్ట్రెచెర్ మీద పడుకుండి పొతారు. అప్పటిదాకా టీవీ కేమెరాలముందు వేసిన వీరంగం,వాగిన వెధవ వాగుడు కట్టిపెట్టి మాట మాత్రం పెగలని ఆస్కార్ నటులవుతారు. ఇక ఆస్పత్రి కెళ్ళాక లొపలేం జరుగుతుందో ఆ దేవుడి కెరుక. ఫాపం వాళ్ళలొ కొద్దిమంది దురదృష్టవంతులుంటారు కల్మాడి గారి లాగా.గుండె పట్టుకునే లోపే తీస్కెళ్ళి లొపలపడేస్తారు వాళ్ళని.

ఇక విషయానికొస్తే, మన కల్మాడీ గారికి మతిమరుపు వ్యాధి వచ్చేసిందట. దీనర్ధం ఏమిటంటే కేసుకి సంబంధించిన ఆస్తుల వివరాలూ, జరిపిన మంతనాలూ,కలిసిన వ్యక్తులూ ఎవరూ గుర్తుండరు అన్నమాట . వ్యాధి ఇంకా ప్రాధమిక దశలోనే ఉందట. బహుశా కేసు తిరిగే మలుపులు బట్టి ఈ మతిమరపు వ్యాధి స్థాయి పెరగొచ్చు. "తెలీదు" అంటే తప్పుగానీ, "గుర్తు లేదు" అంటే అది తప్పుకాదు అనే లాజిక్ ఏ లాయరు మహాశయునికొచ్చిందో, దానికి ఏ డాక్టరు వత్తాసు పలికాడొ గాని, వాళ్ళకి జేజేలు. ఇల్లుకాదు ఇది జైలే, దీన్నుంచి తిమ్మిని బమ్మి చేసైనా బయటపడాలి అనేది మాత్రం మరపుకు రాదండోయ్ . మీరు భలే ఉన్నారే. "అమ్మా! ఆశ,దోశ, అప్పడం వడ.." .

ఏదేమైనా దేశపు పరువుకి పాతరేసి దొరికినంత దోచుకొవాలనుకుంటున్నోళ్ళకి కల్మాడీ ఈవిధంగా మార్గదర్శి కావటం మూడొంతుల పార్లమెంటు సభ్యులు గర్వించదగ్గ విషయం.

The Verdict సినిమాలో అనుకుంటా, హీరో అంటాడు "Courts will not give you Justice, only they will give you a CHANCE to get it అని( డైలాగు సరిగా గుర్తులేదు, అర్ధం మాత్రం ఇదే).అయినా జెత్మలానీలూ, జెట్లీలాంటి దేశ భక్తులున్నప్పుడు ఆ ఛాన్స్ మనకెలా ఇస్తారు చెప్పండి.

జై హింద్.

Tuesday, July 12, 2011

నచ్చిన డ్యూయెట్

ఎప్పుడు చూసినా నా ఫ్రెండ్ కార్లో ఈ పాట మోత మోగుతూ ఉండేది. ఏదో సినిమా పేరు చెప్పాడు గాని మనకి తమిళం అస్సలు రాదు కాబట్టి , ఏ సినిమా అయితే ఏం అని పాటని ఎంచక్కా ఎంజాయ్ చేసేవాడిని.పాట ట్యూన్ చాలా కేచీ గా ఉండేది. ఆ తరువాతెప్పుడో యు ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే ఆ పాట నా కంట పడింది. వినటానికే కాదు చూడటానికి కూడా చాలా బాగుంది. మంచి కోరియోగ్రఫీ, కేమెరా, అన్నిటికీ మించి చలాగ్గా ,చిలిపిగా మీరా జాస్మిన్. ..

మీరా జాస్మిన్ మంచి నటి అని తెలుసుగాని ఆమె సినిమాలు పెద్దగా చూసిన గుర్తు లేదు. ఈపాట లో మాత్రం తెగ నచ్చేసింది నాకు. పాట సాహిత్యం కూడా బాగుండొచ్చేమో అని అనుకుంటున్నాను.

(ఈ పాటని బ్లాగర్ లో embed చేయటానికి అనుమతి ఉన్నట్టు లేదు. Watch on YouTube మీద క్లిక్ చేస్తే ఓపెన్ కావచ్చు.)