Thursday, February 25, 2010

ఈనాటి వార్త

మరీ ఎంత అభిమాన పత్రికైనా ఈరోజు "ఈనాడు" లో సచిన్ డబుల్ సెంచరీ సందర్భంగా రాసిన వార్త చదవగానే భలే చిరాకేసింది. వార్త మెదటి పేరా చదివి నోరెళ్ళ బెట్టాను. ఆ మొదటి పేరా ఇలాఉంది.

"అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ తో మానవాళి చరిత్రను మరో మలుపు తిప్పినప్పుడు, రైట్ బ్రదర్స్ విమానంతో మనిషి ఊహలకు రెక్కలు తొడిగినప్పుడు, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై తొలిసారిగా కాలుపెట్టినప్పుడు , జిం హిన్స్ వంద మీటర్ల పరుగుకు కళ్ళాలు వేసి తొలిసారిగా పది సెకన్లకంటే తక్కువకి లాక్కొని వచ్చినప్పుడు.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో అక్షణాలను అనుభవించిన వారంతా పులకించారో లేదో తెలీదు గాని బుధవారం గ్వాలియర్లో సచిన్ సాధించిన వన్డే ద్వి శతకాన్ని కనులారా చూసిన క్రీడా ప్రేమికులు మాత్రం అంతటి మహదానందాన్ని అనుభవించారు "

ఏమని పిస్తోంది? సచిన్ డబల్ సెంచరీ కొట్టాడు.సరే.. సంతోషం..దాంతో పెన్సిలిన్,రైట్ బ్రదర్స్ విమానం, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామలకేం సంబంధం? జరిగి నలభై యేళ్ళయినా,చందమామ మీద కాలూనడం శాస్త్ర సాంకేతిక రంగంలో ఇప్పటికీ ఒక మైలు రాయి. దానికీ దీనికీ పోలికా?కనీసం పోలికలైనా అతికేట్టు రాయొద్దా? జిం హిన్స్ పోలిక ఒక్కటే క్రీడలకి సంబంధించింది. నా దృష్టిలో అదికూడా అస్సలు అతకలేదు. ఎంతమందికి తెలుసు జిం హిన్స్?

అసలా హెడ్డింగేమిటండీ బాబు, " నీవొక దుర్గం మాకొక స్వర్గం" .. హతవిధీ..ఇంతకంటే మంచిదేమీ తట్టలేదా? ప్చ్

16 comments:

సుజాత said...

దీన్నే తెలుగులో "అత్యుత్సాహం" అందురు!

Anonymous said...

Even I felt the same though I am a hardcore fan of Sachin. Exaggeration by Eenadu... Abburi Ravi

కన్నగాడు said...

నాక్కూడా అలాగే అనిపించింది, అందులో పేర్కొన్న వాళ్ళందరూ ఆవిష్కరించినవి వారి జీవితాల్లోనే కాదు మానవాళి మనుగడలో అత్యున్నతమైన ఆవిష్కరణలు.

ఒకటి మాత్రం నిజం ఈనాడు కూడా సాధారణ పత్రిక అయిపోయింది.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Diarhoea of thoughts and constipation of expression.

KAMAL said...

easy . నిన్న నైటు సచిన్ డబల్ సెంచరీ చేసిన్నప్పుడే అనుకున్న '' రేపు ఉదయం ఈనాడు పేపర్ చదవాలని. ''బలే కామెడీగా రాస్తాడు ఈనాడోడు. im n joyed.

శ్రీకర్ బాబు said...

మీరు రాసింది నిజ్జంగా నిజం......

రవిచంద్ర said...

" నీవొక దుర్గం మాకొక స్వర్గం"

ఏదో ప్రాస బాగుంది కదా అని వాడేసినట్లున్నారు.

Anonymous said...

Sir,
I don't think that the story was badly written. I appreciate it. I found flow in it.
S.Ramu
apmediakaburlu.blogspot.com

చిన్ని said...

అది రాసింది మావారిలాంటి వారు అయ్యుంటారు .డెస్క్ లో ఎడిటరు మావారి తాత అయ్యుంటారు . (క్రికెట్ పిచ్చోల్లకి వాళ్ళే రాముళ్ళు దేవుళ్ళు ) ఫ్లెమింగ్ ,రైట్ ,నీల్ తో పోలిక-:) సచిన్ ముందు వీరెంత హమ్మ !
హమ్మయ్య ఈ సందర్భంగా ఈనాడు ని అభినందించాలి . అనంతం కోపం వచ్చి 'నీలిమేఘాలలో ' పోస్ట్ రాసేలా చేసింది.

మధురవాణి said...

పొద్దున్న పేపర్ చూడగానే, అచ్చం నేను కూడా మీలాగే ఫీలయ్యాను.!

ఉమాశంకర్ said...

వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.

రామూ గారు...నమస్తే...మీ బ్లాగు నేను క్రమం తప్పకుండా చదువుతుంటాను..

జర్నలిజం గురించి నేను కొన్నేళ్ళ క్రితం నేను ఒక పుస్తకంలో చదివిందొకటి ఇప్పుడు మీతో పంచుకుంటాను. అది నా సొంత అభిప్రాయం కాకున్నా,నాకు నచ్చిన అభిప్రాయం.మీరు అల్రెడీ జర్నలిజం వృత్తిలో ఉన్నవారు. అయినా సాహసిస్తున్నాను.

ఏదైనా వార్త రాసేటప్పుడు సబ్జెక్టివిటీని దరికి రానివ్వకూడదు కదా. వార్త ని వార్తగానే ప్రజెంట్ చెయ్యాలి. "నాదల్ ని చితక్కొట్టిన ఫెదెరర్" , అన్నా, "బంగ్లాదేశ్ చేతిలో ఇండియాకి ఘోర పరాజం " అన్నా నా దృష్టిలో తప్పే. "చితక్కోట్టాడా లేదా ?", అది "ఘోర పరాజయమా" కాదా? అనేది నిర్ణయించాల్సింది పాఠకులు . వాళ్ళ తరపున రాసేవాళ్ళు వకాల్తా పుచ్చేసుకుంటే ఎలా చెప్పండి ? ప్రస్తుత కాలంలో దీన్ని ఆశించలేం లెండి.

ఇక ఫ్లో అంటున్నారు, ఫ్లో అంటే రాసే అతను ఒకరకమైన ఉద్వేగానికిలోనై రాసాడంటారా? అలా అయినా అది తప్పే కదండీ? కథో కవిత్వమో అయితే సర్దుకుపోవచ్చు, ఇది వార్త కదా?

భావన said...

హ హ హ మా అన్నయ్య ఈనాడు లో పని చేసినప్పుడూ చెప్పే వాడూ పొద్దుటే రామోజి రావు పేపర్ మొత్తం చూసి తేడాలుంటే పిలిచి చూపించే వారని. బహుశా ఒక స్టేజ్ కు వచ్చాక ఇక చెయ్యటం లెదేమో.

పానీపూరి123 said...

అవును, నాకు కూడా మొదట చూడంగానే హెడ్డింగ్ అర్ధం కాలేదు...

ఉమాశంకర్ said...

భావనగారు: నేనూ విన్నాను,అచ్చుతప్పుల గురించి బాగా పట్టించుకునేవారని..ఇది దానికంటే దారుణం కదా..

@పానీపురి గారు: నాకిప్పటికీ అర్ధం కాలేదండీ,, :)

సుజాత said...

ఉమా శంకర్ గారూ,
ఒక న్యూస్ పేపర్లో మిగతా పేజీలు వేరు! స్పోర్ట్స్ పేజీ వేరండీ! వార్తను వార్త లాగా ప్రెజెంట్ చెయ్యాలనే రూలు ఈ పేజీకి వర్తించదు.(నిజానికి ఇవాళ్టి రోజు ఏ పేజీకీ వర్తించదు) ఆ పేజీలో ఉండేవారికి ఇలాటి వాక్యాలు రాసే స్వేచ్ఛ ప్రతి పేపర్లోనూ ఉంటుంది. అద్దిరిపోయే ఇన్నింగ్స్, గూబలదిరే సిక్సర్ ఇలాంటి మాటలు సాధారణంగా రాస్తారు. దాని ఉద్దేశం ఇంతకు ముందు రోజు ఆటను టీవీలో చూసిన ప్రేక్షలు కూడా తమను తాము ఆ ప్రయోగాలతో ఐడెంటిఫై చేసుకోవడం కోసమే! ఆటలు చూసేవారిలో ఎక్కువమంది యూతే ఉంటారు.అలాగే పేజీలో వాళ్ళు కూడా సాధారణంగా యూతే ఉంటారు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ టివీలో చూశాక కూడా మర్నాడు పేపర్లో అది ఎలా ప్రెజెంట్ అయిందో తెలుసుకోడానికి పేపర్ కోసం ఎదురు చూస్తాం! ఎందుకు? ప్రేక్షకుల ఎగ్జైట్ మెంట్ పేపర్లో రిఫ్లెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోడానికే!

ఈనాడు స్పోర్ట్స్ పేజీలో హెడ్డింగ్స్ ఎంతో బావుంటాయి. కాకపోతే నిన్న కొంచెం ఎగ్జైట్ మెంట్ ఎక్కువైంది! అంతే!

రవిచంద్ర,

ప్రాస కోసం కాదండీ! అది శ్రీ శ్రీ గారి కవిత. దాన్ని అనుసరించి రాయబోయారు.

ఉమాశంకర్ said...

సుజాతగారు,

నాది వానాకాలం జర్నలిజం చదువు అని కొట్టి పడేస్తారేమో, నాకు తెలిసింది చెప్తాను. స్పోర్ట్స్ జర్నలిజం లో మనకున్న విభాగాల్లో ( రేడియో,టీవీ,ప్రింట్) , వార్తని ప్రజెంట్ చేసే విధానం దేని కదే విభిన్నం. రేడియోలో ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చెప్పాలి. అదే టీవీలో ఎలాగు కళ్ళకు కనపడుతుంటుంది కాబట్టి రక్తి కట్టించాలంటే ఇంకాస్త కష్టపడక తప్పదు. అందుకే ఆటలో విరామం రాగానే (క్రికెట్లో బౌలింగ్ ఎండ్ మారేప్పుడు లేదా టెన్నిస్ లో సర్వీసు మారుతూ ఆటగాళ్ళు సేద తీరుతున్నప్పుడో ) కామెంటేటర్లు నానా కష్టాలు పడుతుంటారు. ఆ పలానా ఆటగాన్ని ఈరోజు మధ్యాహ్నం నెట్ దగ్గర కలిసి మాట్లాడిన మాటలో, ఆయన కుదుర్చుకున్న ఎండోర్స్ మెంటు కాంట్రాక్టుల గురించో ..అలా ఏవేవో చెప్పి ఫిల్ చేసేస్తారు .. అదే ప్రింట్ లోకోచ్చేసరికి నా ఉద్దేశంలో వార్త ఎనలిటికల్ గా ఉండాలి.టీవీ ప్రజెన్ టేషన్ స్టైల్ ని పేపర్ మీదికి తేవడానికి పడే (అనవసర) ప్రయాసలోనే ఉంది తిరకాసంతా..

ఇక హెడ్ లైన్స్. నాకు కొన్ని నచ్చుతాయి.కొన్ని చిరాకెత్తిస్తాయి. 'శతక్కో'ట్టిన సచిన్ ( ఇలాంటిదేదో చూసిన గుర్తు ) లాంటివి నాకసలు రుచించవు.. కొన్ని బావుంటాయి..కొన్ని కష్టపడి ఇరికించినట్టు తెలుస్తూనే ఉంటుంది.ఈ ప్రయత్నంలో భాష ఖూనీ కావడం బోనస్ :).నచ్చడం నచ్చకపోవడం వ్యక్తిగతం అనుకోండి. :)

Post a Comment